🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 16 Aug, 2026 | Page: 1

కొబ్బ‌రినీళ్లు వర్సెస్ ఓఆర్ఎస్‌.. రెండింటి మ‌ధ్య తేడాలేమిటి..

వేసవిలోనైనా, శరీరంలో నీరు తగ్గినప్పుడైనా చాలామంది కొబ్బరి నీళ్లను సహజమైన హైడ్రేషన్ డ్రింక్‌గా భావిస్తారు. అయితే విరేచనాలు, వాంతులు వంటి కారణాలతో శరీరం నుంచి నీరు, లవణాలు ఎక్కువగా కోల్పోయినప్పుడు కొబ్బరి నీళ్లు సరిపోతాయా? లేక ఓఆర్ఎస్ (ORS) తీసుకోవాలా? ఈ రెండింటి ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయని నిపుణుల సూచనలు చెబుతున్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం, విటమిన్ సి, సహజ చక్కెరలు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. అందుకే సాధారణ రోజువారీ హైడ్రేషన్‌కు కొబ్బరి నీళ్లు మంచి ఎంపికగా ఉంటాయి. ముఖ్యంగా వేడి వాతావరణంలో, స్వల్ప వ్యాయామం తర్వాత లేదా ఆకలి తక్కువగా ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు శరీరానికి ద్రవాలను అందించడంలో సహాయపడతాయి. అయితే కొబ్బరి నీళ్లను ఓఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా భావించడం సరికాదు. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉండగా, సోడియం పరిమాణం తక్కువగా ఉంటుంది. మరోవైపు ఓఆర్ఎస్‌లో సోడియం, గ్లూకోజ్, పొటాషియం, క్లోరైడ్, సిట్రేట్ వంటి ఎలక్ట్రోలైట్లు శాస్త్రీయంగా నిర్దిష్ట నిష్పత్తిలో ఉంటాయి. శరీరంలో నీరు, లవణాలు గణనీయంగా తగ్గినప్పుడు వేగంగా శోష‌ణ‌కు గుర‌య్యేందుకు ఓఆర్ఎస్‌ను ప్రత్యేకంగా రూపొందించారు.
🏠 Home