‘దృశ్యం 3’కు టైటిల్ ఫిక్స్..
బాలీవుడ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అజయ్ దేవగణ్, టబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘దృశ్యం 3’ పై తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. మేకర్స్ సినిమా అధికారిక టైటిల్‌ను ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటివరకు ‘దృశ్యం 3’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ‘దృశ్యం 3: ది కంక్లూజన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌లోనే ‘ది కన్‌క్లూజన్’ అని పేర్కొనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంటే అజయ్ దేవగణ్ నటిస్తున్న హిందీ ‘దృశ్యం’ కథకు ఈ సినిమాతో ముగింపు పలకనున్నారా? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని 2026 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘దృశ్యం 2’కు దర్శకత్వం వహించిన అభిషేక్ పాఠక్‌నే మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు.‘దృశ్యం 3’ విషయంలో మేకర్స్ మొదటి నుంచీ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఈ సినిమా ఒరిజినల్ మలయాళ వెర్షన్‌కు సీన్ బై సీన్ రీమేక్‌గా ఉండదని తెలిపారు. ముఖ్యంగా కథలోని కీలక ఘట్టాలతో పాటు క్లైమాక్స్ కూడా హిందీ వెర్షన్‌లో పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నట్లు సమాచారం. దీంతో విజయ్ సల్గావ్‌కర్ కుటుంబం కథను హిందీ వెర్షన్‌లో ఎలాంటి ముగింపుతో తీసుకురాబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో రూపొందిన మలయాళ ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నాలుగో భాగం వైపు అడుగులు వేస్తోంది. మరోవైపు అజయ్ దేవగణ్ నటిస్తున్న హిందీ ఫ్రాంచైజీ మాత్రం ‘దృశ్యం 3: ది కన్‌క్లూజన్’తో ముగుస్తున్నట్లు టైటిల్ ద్వారా సంకేతాలు ఇస్తోంది.