‘మల్లెపూల పల్లకి’కి శివ నిర్వాణ స్టెప్పులు..
మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ రవితేజ కెరీర్‌లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచే దిశగా పయనిస్తోంది.ఈ నేపథ్యంలో చిత్రబృందం ఘనంగా నిర్వహించిన ‘ఇరుముడి’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో దర్శకుడు శివ నిర్వాణ చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.సక్సెస్ వేడుకలో ‘ఇరుముడి’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘మల్లెపూల పల్లకి’ ప్లే అవుతుండగా, చిత్రబృందంతో కలిసి దర్శకుడు శివ నిర్వాణ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. సాధారణంగా కథలు, దర్శకత్వం గురించి మాట్లాడే శివ నిర్వాణలో ఇంత మంచి డ్యాన్సింగ్ టాలెంట్ ఉందా అంటూ అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. గ్రేస్‌తో పాటు ఫుల్ ఎనర్జీతో ఆయన వేసిన స్టెప్పులకు మంచి స్పందన వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు శివ నిర్వాణను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. “డైరెక్షన్ మాత్రమే కాదు.. డ్యాన్స్‌లోనూ శివ నిర్వాణకు మంచి టాలెంట్ ఉంది” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.