అమెరికాలో మోహన్ భగవత్ ఈవెంట్ ఆర్గనైజర్లకు షాక్..
అమెరికాలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన చుట్టూ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ పర్యటనను న్యూయార్క్ మేయర్ మామ్దాని వ్యతిరేకించగా, అనేక ఇస్లామిక్ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా మోహన్ భగవత్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన సంస్థకు సోషల్ మీడియా సంస్థ ఎక్స్ షాకిచ్చింది. ఈ సంస్థ ఎక్స్ అకౌంట్‌ను సస్పెండ్ చేసింది.అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్ (ఏహెచ్‌ఈఏడీ) సంస్థ న్యూయార్క్ నగరంలోని మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లోని ఇన్ఫోసిస్ థియేటర్‌లో మోహన్ భగవత్‌తో ‘యూనివర్సల్ వన్‌నెస్’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 29న ఈ సదస్సు జరగాల్సి ఉంది. దీనికి దాదాపు 5,000 మంది హాజరవుతారు. అయితే, మోహన్ భగవత్ పర్యటనను న్యూయార్క్ మేయర్‌తోపాటు అక్కడి ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.అయితే, ఈ కార్యక్రమానికి అమెరికాకు చెందిన పలువురు సెలబ్రిటీలు మద్దతు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలు సమర్దిస్తున్నారు. ఇది బహిరంగ స్వేచ్ఛ, చర్చ, పరస్పర గౌరవం అనే స్ఫూర్తితో జరుగుతున్న కార్యక్రమం అని ఆర్‌ఎస్‌ఎస్ వ్యాఖ్యానించింది. అన్ని వర్గాల వారు, విభిన్న సంస్కృతుల వారు, బహుముఖ విశ్వాసం కలవారెవరైనా ఈ కార్యక్రమానికి హాజరు కావొచ్చని ఆర్‌ఎస్‌ఎస్ స్పష్టం చేసింది. తమ సంస్థ సిద్ధాంతాలను అర్థం చేసుకునేందుకు కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వివరించింది.