ప్రపంచ పటంలో మార్పులు: ఆఫ్రికా పెద్దగా.. అమెరికా చిన్నగా..
ప్రపంచ పటంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉన్న ప్రఖ్యాత మెర్కేటర్ ప్రపంచ పటానికి బదులుగా.. భూమి ఉపరితలాన్ని మరింత కచ్చితంగా చూపించే ఈక్వల్ ఎర్త్ మ్యాప్‌ను ఆవిష్కరిస్తూ ఐక్యరాజ్యసమితి కీలక తీర్మానం చేసింది. ఈ నూతన ప్రపంచ పటంలో ఆఫ్రికా పరిమాణం పెద్దగా కనిపిస్తుండగా.. ఐరోపా, ఉత్తర అమెరికా సైజు చిన్నగా అయింది. ఐక్యరాజ్యసమితి చేసిన ఈ తీర్మానానికి 164 దేశాలు మద్దతు పలికాయి. అమెరికా మాత్రమే దీనికి వ్యతిరేకించగా.. మరో ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. కాగా ఖండాల అసలు విస్తీర్ణానికి అనుగుణంగా రూపొందించిన ఈ కొత్త ప్రపంచ పటాన్నే వినియోగించాలని సభ్య దేశాలను ఐరాస కోరింది.మారిటైం నేవిగేషన్ కోసం 1569లో ప్రముఖ కార్టోగ్రాఫర్ గెరార్డస్ మెర్కేటర్ ప్రపంచ పటాన్ని రూపొందించారు. ఇప్పటికీ అన్ని దేశాలు దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. అప్పట్లో భూభాగాల ఆకృతులు, కోణాలను కచ్చితత్వంతో చూపించడంపైనే దృష్టి పెట్టి ఈ మ్యాప్‌ను గీశారు. అయితే ఖండాల పరిమాణాలు మాత్రం అందులో కచ్చితంగా లేవనే వాదన ఉంది. గోళాకారంలో ఉండే మన భూగ్రహాన్ని.. టు డైమెన్షనల్ మ్యాప్‌లో చూపించినప్పుడు.. ఉత్తర ప్రాంతాలు పెరిగి భూమధ్యరేఖ ప్రాంతాలకు కుచించుకుపోయాయని పలువురు నిపుణులు గతంలో పేర్కొన్నారు. అందుకే మెర్కేటర్ పటంలో యూరప్, ఉత్తర అమెరికా పెద్దగా ఉన్నట్లు కనిపిస్తుండగా.. ఆఫ్రికా, దక్షిణ అమెరికా వాస్తవ పరిమాణం కంటే చిన్నగా కనిపిస్తాయి.ఈ తేడాను తగ్గించేందుకే ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్‌ను 2018లో కొందరు కార్టోగ్రాఫర్లు రూపొందించారు. ఇందులో ఖండాల విస్తీర్ణాలను వాటి వాస్తవ పరిమాణాలకు దగ్గరగా చూపిస్తూ మ్యాప్‌ను గీశారు. ఫలితంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా, ఓషియానియా వంటి ప్రాంతాలు మ్యాప్‌లో మరింత పెద్దగా కనిపించాయి. ఈ తీర్మానాన్నే తాజాగా ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. దీన్ని టోగో ప్రతిపాదించింది. ప్రపంచాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారనే విషయంలో మ్యాప్స్ కీలక పాత్ర పోషిస్తాయని టోగో విదేశాంగ మంత్రి రాబర్ట్ డస్సీ అన్నారు. ‘మ్యాప్స్ విద్యను ప్రభావితం చేస్తాయి. ఊహాశక్తిని పెంచుతాయి. ప్రపంచంపై సమాజాల అవగాహనను రూపొందిస్తాయి. అందువల్ల అవి ఎప్పుడూ తటస్థమైనవి కావు. భూమిని వక్రీకరించిన రూపంలో చూపిస్తే.. ఆ తప్పుదోవ పట్టించే అవగాహన తరతరాలకు కొనసాగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.