బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా కూలిన న్యూస్ హెలికాప్టర్..
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ప్రమాదాన్ని గగనతలం నుంచి కవర్ చేస్తున్న ఓ న్యూస్ హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. లాస్ ఏంజెల్స్‌లోని చాట్స్‌వర్త్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.మంగళవారం సాయంత్రం చాట్స్‌వర్త్ ప్రాంతంలో ఓ ఎస్‌యూవీ, మెట్రో బస్సును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటనను కవర్ చేసేందుకు పలు న్యూస్ హెలికాప్టర్లు గాల్లో తిరుగుతున్నాయి. ఆ సమయంలో ఎన్‌బీసీ4 న్యూస్‌కు చెందిన హెలికాప్టర్ ఒక్కసారిగా కిందకు దూసుకెళ్లి పార్కింగ్ ప్రాంతంలో కూలిపోయింది. హెలికాప్టర్‌లోని కెమెరాలో రికార్డైన వీడియోలో మొదట బస్ ప్రమాదం జరిగిన ప్రాంతం కనిపిస్తోంది. అనంతరం హెలికాప్టర్ ఒక్కసారిగా కిందకు దిగుతున్నట్లు, కెమెరా తీవ్రంగా కదులుతున్నట్లు కనిపించింది.