🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 16 Sep, 2026 | Page: 1

మందుల‌ను స‌క్ర‌మంగా తీసుకుంటున్నా షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతున్నాయా..

మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు క్రమం తప్పకుండా మందులు వాడుతుంటారు. అయినప్పటికీ కొందరిలో అకస్మాత్తుగా రక్తంలో చక్కెర పెరగడం కనిపిస్తుంది. మందులు సక్రమంగా తీసుకుంటున్నా ఇలా ఎందుకు జరుగుతుందనే సందేహం చాలామందికి ఉంటుంది. ఆహారపు అలవాట్లు, భోజనం చేసే సమయం, తీసుకునే ఆహారం పరిమాణం, శారీరక శ్రమ, నిద్ర, ఒత్తిడి వంటి అనేక అంశాలు రక్తంలో చక్కెరపై ప్రభావం చూపుతాయి. జ్వరం, ఇన్ఫెక్షన్ వంటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా చక్కెర స్థాయిలు తాత్కాలికంగా పెరుగుతాయి. అందుకే మందులతోపాటు జీవనశైలిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసర‌మ‌ని నిపుణులు చెబుతున్నారు.
ఆహార ప‌దార్థాలు..
శుద్ధి చేసిన కార్బొహైడ్రేట్లు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి. తెల్ల బియ్యం, స్వీట్లు, చక్కెర కలిగిన పానీయాలు, బేకరీ పదార్థాలను అధికంగా తీసుకోవడం ఇందుకు కారణమవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారమైనా పరిమాణం ఎక్కువగా ఉంటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతాయి. మందులను సూచించిన సమయానికి తీసుకోకపోవడం, మోతాదులు మర్చిపోవడం కూడా రక్తంలో చక్కెరలో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. అలాగే బరువు పెరగడం, శారీరక శ్రమ తగ్గడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి మధుమేహ నియంత్రణ కష్టమవుతుంది. భోజనాన్ని తరచూ మానేయడం వల్ల తరువాత ఎక్కువగా తినే అవకాశం ఏర్పడి చక్కెర ఒక్కసారిగా పెరిగే అవ‌కాశం ఉంటుంది.
మాన‌సిక స‌మ‌స్య‌లు..
నిరంతర ఒత్తిడి, ఆందోళన, సరైన నిద్ర లేకపోవడం కూడా రక్తంలో చక్కెర నియంత్రణను ప్రభావితం చేస్తాయి. శరీరంలో ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లు పెరగడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య శరీరంలో సహజంగా కొన్ని హార్మోన్లు విడుదల కావడం వల్ల రక్తంలో చక్కెర పెరగడాన్ని డాన్ ఫినామినన్ గా పేర్కొంటారు. జ్వరం, ఇన్ఫెక్షన్ లేదా ఇతర అనారోగ్య పరిస్థితుల్లోనూ చక్కెర పెరుగుతుంది. శారీరక కదలికలు తక్కువగా ఉండడం, అధికంగా మద్యం తీసుకోవడం కూడా మధుమేహ నియంత్రణపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తరచూ దాహం వేయడం, ఎక్కువసార్లు మూత్రవిసర్జన, అలసట, చూపు మసకబారడం, గాయాలు ఆలస్యంగా మానడం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి.
🏠 Home