🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 09 Jun, 2026 | Page: 1

నైట్‌క్ల‌బ్‌లో బెన్ స్టోక్స్ గొడ‌వ‌.. ప్ర‌మాదంలో కెప్టెన్సీ !

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) మ‌ళ్లీ గొడ‌వ ప‌డిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా టీం ప్రోటోకాల్‌ను అత‌ను ఉల్లంఘించాడు. లార్డ్స్‌లో కివీస్‌పై తొలి టెస్టు గెలిచిన త‌ర్వాత అత‌ను పార్టీ చేసుకున్నాడు. చెల్సీలో నైట్‌క్ల‌బ్‌కు వెళ్లాడు. స్టోక్స్‌తో పాటు గ‌స్ అట్కిన్‌స‌న్ కూడా టీం ఆంక్ష‌ల‌ను ఉల్లంఘించిన‌ట్లు తెలుస్తోంది. సారాసెన్స్ అకాడ‌మీ ర‌గ్బీ ప్లేయ‌ర్‌తో ఇద్ద‌రు క్రికెట‌ర్లు గొడ‌వ ప‌డిన‌ట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఆరా తీస్తున్న‌ది.

ర‌గ్బీ ప్లేయ‌ర్ క్రికెట‌ర్ అట్కిన్‌స‌న్‌పై పంచ్ విసిరాడు. కానీ ఈసీబీ సెక్యూర్టీ గార్డుకు ఆ పంచ్ త‌గిలింది. అత‌నికి కుట్లు కూడా ప‌డ్డాయి. అయితే ఆ ఘ‌ర్ష‌ణ‌లో స్టోక్స్‌, అట్కిన్‌స‌న్ గాయ‌ప‌డ‌లేదు. క్రికెట‌ర్లు దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని ఈసీబీ పేర్కొన్న‌ది. ఘ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశానికి పోలీసులు కూడా రాలేద‌ని తెలిసింది. అయినా కానీ ఆ ఘ‌ట‌న ప‌ట్ల ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

వాస్త‌వానికి ఇటీవ‌ల ఇంగ్లండ్ క్రికెట్ క‌ఠిన నియ‌మావ‌ళి పాటిస్తున్న‌ది. ఆట‌గాళ్ల ప్ర‌వ‌ర్త‌న అంశంలో ఫోక‌స్ పెట్టింది. మిడ్‌నైట్ క‌ర్ఫ్యూ విధించింది. యాషెస్ సిరీస్‌తో స‌మ‌యంలో ఫిర్యాదులు వెల్లువెత్త‌డం వ‌ల్ల మిడ్‌నైట్ క‌ర్ఫ్యూలో భాగంగా క్రికెట‌ర్లు నైట్‌క్ల‌బ్‌ల‌కు వెళ్ల‌వ‌ద్దు అని ఈసీబీ ఆదేశించింది. కానీ కివీస్‌తో లార్డ్స్‌లో జ‌రిగిన టెస్టు త‌ర్వాత ఆట‌గాళ్లు సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఇక స్టోక్స్‌, అట్కిన్‌స‌న్ మాత్రం నిర్దేశిత‌ స‌మ‌యం ముగిసిన త‌ర్వాత కూడా క్ల‌బ్‌లోనే ఉన్నారు. దీని వ‌ల్ల ఓ ర‌గ్బీ ఆట‌గాడితో గొడ‌వ జ‌రిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు.

ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించిన బెన్ స్టోక్స్ భ‌విత‌వ్యం ప్ర‌మాదంలో ప‌డింది. అత‌న్ని కెప్టెన్సీ నుంచి శాశ్వ‌తంగా తొల‌గించే అవ‌కాశాలు ఉన్నాయి. ఓవ‌ల్‌లో జ‌రిగే రెండో టెస్టుకు బెన్ స్టోక్స్ ను నుంచి త‌ప్పించ‌నున్నారు. అట్కిన్‌స‌న్‌ను కూడా జ‌ట్టు నుంచి తొలగించే అవ‌కాశాలు ఉన్నాయి. హ్యారీ బ్రూక్ రెండో టెస్టుకు కెప్టెన్సీ చేప‌ట్ట‌నున్నాడు. అయితే 2017లో కూడా ఓసారి బెన్ స్టోక్స్ నైట్‌క్ల‌బ్‌లో దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే.
🏠 Home