🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 20 Jun, 2026 | Page: 1

సుస్వర సంగీతాన్ని ఆస్వాదించని వారుండరు కదా !

(21 జూన్‌ “ప్రపంచ సంగీత దినోత్సవం” సందర్భంగా)
“శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తల గానస్రవంతో ఫణిః” అని ఆర్యోక్తి. అనగా శిశువులు, పశువులు,
పావులు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయి. మానసిక స్థితిని నియంత్రించడానికి సంగీతం ఒక గొప్ప మార్గం. ఆది ప్రణవనాదమైన “ఓంకారం” నుంచి సంగీతం ఉద్భవించింది. సంగీత సాధన ద్వారా ఏకాగ్రత, మేధో వికాసం పెరుగుతాయి. సంగీతం ఓ విశ్వ భాష. సంగీతానికి పేద ధనిక, కుల మతాల, ప్రాంత, సరిహద్దులు, సాంస్కృతులు, వర్ణ-వర్గ వివక్షలు, భాషా బేధాలు ఉండవు. సుస్వర సంగీతం అందరినీ అలరిస్తుంది. సంగీత సాధన ఓ దివ్య తపస్సు. సంగీత సాగరంలో ఈదిన వారికి శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక, సామాజిక సమతుల్యత సిద్ధిస్తుంది. కష్టాల నుంచి సుఖాలకు, మానసిక ఒత్తిడి నుంచి ప్రశాంతత వైపుకు, చీకటి నుంచి వెలుతురు వైపుకు నడిపించే పవిత్ర మాద్యమమే సంగీతం అవుతుంది. సంగీత విద్వాంసులు, సంగీతాన్ని వృత్తిగా చేపట్టిన వారు, సంగీత పాఠశాలలు, ఆర్కెస్ట్రా సమూహాలు, సంగీతాభిమానులను ఏకం చేసే కార్యక్రమాలు నిరంతరం జరగాలి. ఓ భాషకంటూ లేని మహాద్భుత మాద్యమంగా సంగీతం మనసును ఉల్లాస పరిచి మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది.
ప్రపంచ సంగీత దినోత్సవం-2026:
ప్రపంచ మానవాళిని ఏకం చేస్తున్న శక్తివంతమైన సాధనం అయిన సంగీతం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, సంగీత సాధనకు ప్రోత్సహించడం, సంగీత విద్వాంసులను సన్మానించుకోవడం లాంటి పవిత్ర కార్యక్రమాలను నిర్వహించడానికి 1982 నుంచి ప్రతి ఏట 21 జూన్‌ రోజున “ప్రపంచ సంగీత దినోత్సవం (వరల్డ్‌ మ్యూజిక్‌ డే)” నిర్వహించడం సముచితంగా ఉన్నది. శాస్త్రీయ సంగీత స్వరాలు తెలియకపోయినా దానిని ఆస్వాదించడం మనకు తెలుసు. ప్రపంచ సంగీత దినోత్సవ వేదికగా సంగీత పోటీలను నిర్వహించడం, సంగీత విద్వాంసుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, సామాన్యులకు సంగీత శక్తిని వివరించడం, సరి కొత్త సంగీత ప్రయోగాలు చేయడం, సంగీత నైపుణ్యాలను వినిమయం చేసుకోవడం లాంటి కార్యక్రమాలను నిర్వహించవచ్చు. ప్రపంచ సంగీత దినోత్సవం-2026 ఇతివృత్తంగా ప్రత్యేక అంశం నిర్ణయించనప్పటికీ “పౌర సమాజ ఐక్యతకు వారధి, సంతోషాల వ్యాప్తి మాధ్యమం” అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు.
భారతీయ శాస్త్రీయ సంగీతం:
భారతీయ సంగీత ప్రపంచంలో స్వరాల అమరికలను రాగాల రూపంలో వ్యక్తం చేస్తారు. సప్తస్వరాలైన స,రి,గ,మ,ప,ద,ని ఆధారంగా మన సంగీతం సుసంపన్నం అవుతున్నది. భారతీయ సంగీతంలో 72 మేళకర్త రాగాలు ప్రాథమికమైనవి. వీటి నుంచే అనేక జన్య రాగాలు ఉద్భవించాయి. బైరవి, భైరవ్‌, యమన్‌, భూపాలి, ఖమాజ్‌, దేస్‌, దుర్గ, బృందావనిసారంగ్‌ లాంటి పలు ముఖ్య రాగాలు ఉన్నాయి. భారతీయ శాస్త్రీయ సంగీతం హిందూస్తానీ, కర్ణాటక అనబడే రెండు ప్రధాన రకాలుగా విభజించబడింది. వీటికి తోడుగా ఆధునిక భారతం జానపద, భక్తి, భాంగ్రా, సినీ సంగీతం, రాక్‌, పాప్‌, బ్లూస్‌, జజ్‌ లాంటిఅనేక సంగీత రకాలు పుట్టుకు వస్తున్నాయి. ప్రముఖ భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేసిన విద్యాంసుల జాబితాలో పండిట్ రవిశంకర్‌, లతా మంగేష్కర్‌, ఏ ఆర్‌ రహెమాన్‌, ఆర్డీ బర్మన్‌, పండిట్‌ భీంసేన్‌ జోషి, హరిప్రసాద్‍ చౌరాసియా, ఉస్తాద్‍ బిస్మిల్లా ఖాన్‌, వినాయకరామ్‌, పండిట్‌ శివకుమార్‌ శర్మ లాంటి ఎందరో ఉన్నారు. భారతీయ మహిళా సంగీత విద్వాంసుల జాబితాలో ఎం ఎస్‌ సుబ్బలక్ష్మి, గంగూబాయి హంగల్‌, అన్నపూర్ణ దేవి, లతా మంగేష్కర్‌, ఆశా భోంస్లే, శ్రేయ ఘోషల్‌, సన్నిధి చౌహాన్‌ లాంటి వారితో పాటు సంగీత మార్గదర్శకులుగా అనుష్క శంకర్‌, బాంబే జయశ్రీ లాంటి పలువురు ఉన్నారు.
సంగీతం ప్రజలను ఏకం చేస్తుంది. వివిధ సంస్కృతులను ఒక దగ్గరకు చేర్చుతుంది. ప్రపంచ మానవాళికి ప్రశాంతతను బహుకరిస్తుంది. విశ్వ మానవాళి అవగాహనను పెంచుతుంది. సామరస్యాన్ని పరిచయం చేస్తుంది. సంగీత కళాకారులకు జీవనోపాధిని, ప్రత్యేక గుర్తింపును కలిగిస్తుంది. సంగీత వైవిధ్యాలను పరిచయం చేస్తుంది.
డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి
9949700037
🏠 Home