🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 22 Jun, 2026 | Page: 1

మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం..

రష్యా రాజధాని మాస్కోను లక్ష్యం చేసుకుని ఉక్రెయిన్ మరోసారి వందలాది డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన డ్రోన్లు మాస్కో వైపు దూసుకొస్తుండగా, రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. దాదాపు 60 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో మాస్కోలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
మాస్కోను లక్ష్యంగా చేసుకుని వచ్చిన డ్రోన్లను నగర పరిసర ప్రాంతాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్టు ఆ ప్రాంత మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. డ్రోన్ల శకలాలు పడిన ప్రాంతాలకు అత్యవసర సిబ్బందిని పంపినట్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు నివేదికలు లేవని అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా షెరెమెత్యేవో, డొమోడెడోవో, వ్నుకోవో, జుకోవ్‌స్కీ విమానాశ్రయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత విమాన సర్వీసులను పునరుద్ధరించారు.
🏠 Home