🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 24 Jun, 2026 | Page: 1

శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి



: డీఎస్పీ నల్లపు లింగయ్య

నారాయణపేట( కోస్గి), జూన్ 24 (బి వి కే న్యూస్)

పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని డీఎస్పీ నల్లపు లింగయ్య సూచించారు. బుధవారం కోస్గి టౌన్‌లో మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ... రోడ్డు వైండింగ్ విషయంలో మతపరమైన వివాదాలు తలెత్తినప్పుడు సంబంధిత మతాల పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులతో చర్చించి సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఎవరు అయినా కావాలనే విద్వేషాలు రెచ్చగొట్టడం, వదంతులు ప్రచారం చేయడం లేదా ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తే వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలు సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, నిర్ధారణ లేని సమాచారం, రెచ్చగొట్టే పోస్టులు లేదా సందేశాలను ఫార్వర్డ్ చేయవద్దని సూచించారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.
శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లోనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని, పెట్టుబడులు, వ్యాపారాలు, విద్యా మరియు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని డీఎస్పీ తెలిపారు. కోస్గి పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రజలందరూ పరస్పర గౌరవం, సహనం, సామరస్యంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో శాంతి, భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం కట్టుబడి ఉందని, ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగిస్తామని డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు.
🏠 Home