దేవరకొండ పట్టణంలో రూ. 1.42 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ 28జూన్ (BVK 3 న్యూస్ ) : దేవరకొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా 11 మరియు 12వ వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. నగరాభివృద్ధి నిధుల నుండి రూ. 1 కోటి 42 లక్షల 25 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. "ప్రజలకు మెరుగైన రహదారులు, స్వచ్ఛమైన తాగునీరు, డ్రైనేజీ మరియు విద్యుత్ వంటి కనీస సౌకర్యాలను కల్పించడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం" అని ఆయన పేర్కొన్నారు.
గతంలో అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలను గుర్తించి, ప్రాధాన్యత క్రమంలో పనులను వేగవంతం చేస్తున్నామని ఆయన తెలిపారు. దేవరకొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూరుస్తోందని, ప్రజల సమస్యలను దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
కొత్తగా నిర్మించనున్న ఈ సీసీ రోడ్ల ద్వారా స్థానికులకు రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా, ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు తొలగిపోతాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులు సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.