🏠 www.bvknews.com
Watermark
Newspaper Logo
www.bvknews.com | Date: 03 Jul, 2026 | Page: 1

సొంతగడ్డపై తిరుగులేని ఇంగ్లండ్..

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ ఫైట్‌కు మరో రెండు రోజులే ఉంది. లీగ్ దశను అజేయంగా ముగించి.. సెమీఫైనల్లో చెలరేగిన ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా(Australia) టైటిల్ పోరుకు సిద్ధమవుతున్నాయి. సొంతగడ్డపై ఘనమైన రికార్డు ఇంగ్లండ్‌కు అనుకూలంగా ఉండడంతో.. ఆసీస్‌కు కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే.. ఇప్పటివరకూ నాలుగు పర్యాయాలు స్వదేశంలో ఐసీసీ ట్రోఫీని వదల్లేదు ఇంగ్లండ్. ఆరుసార్లు ఛాంపియన్‌ కంగారూ టీమ్‌ అవకాశాల్ని కొట్టిపారయలేమని మరికొందరి వాదన. ఈ నేపథ్యంలో ఆదివారం లార్డ్స్‌ వేదికగా జరుగనున్న ఫైనల్లో ఆతిథ్య జట్టు జైత్రయాత్రకు సోఫీ మొలినెక్స్ బృందం చెక్ పెడుతుందా? అనేది ఆసక్తి రేపుతోంది.
పదో సీజన్ మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ కప్‌పై కన్నేసింది. స్వదేశంలో ఇప్పటివరకూ ఐసీసీ వరల్డ్‌కప్‌(వన్డే/టీ20) ట్రోఫీని వదలని ఇంగ్లండ్ ఈసారి కూడా ఆనవాయితీని కొనసాగించాలనే కసితో ఉంది. అందుకుతగ్గట్టే దుమ్మురేపే ఆటతో ఫైనల్‌కు దూసుకెళ్లింది నాట్ సీవర్ బ్రంట్ సేన. పొట్టి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు ఇది ఐదో ఫైనల్. గతంలో 2009, 2012, 2014, 2018లో ఫైనల్ ఆడింది ఇంగ్లిష్ టీమ్.
🏠 Home