Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్‌.. రెండింటి మ‌ధ్య తేడాలేమిటి..

    Author VENKATESH | 28 Jul 2026, 04:44 PM | HEALTH
     తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్‌.. రెండింటి మ‌ధ్య తేడాలేమిటి..

    అన్నం భారతీయుల రోజువారీ ఆహారంలో విడదీయరాని భాగం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే ధాన్యాల్లో బియ్యం ఒకటి. ప్రపంచంలో 1.2 లక్షలకు పైగా బియ్యం రకాలు ఉన్నట్లు అంచనా. బియ్యం ప్రధానంగా కార్బొహైడ్రేట్లకు మంచి మూలం అయినప్పటికీ, ఇందులో శరీరానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. అయితే తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్ మధ్య పోషక విలువల్లో తేడా ఉండటంతోపాటు, బరువు నియంత్రణపై కూడా వీటి ప్రభావం భిన్నంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బియ్యంలో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్ శరీరంలోని రసాయన చర్యలను నియంత్రించడంలో, ఆహారాన్ని శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇందులో ఉండే ప్రోటీన్ శరీర కణజాలాల మరమ్మత్తుల‌కు ఉపయోగపడుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు కలిగే నష్టాన్ని తగ్గించడంలో కూడా బియ్యంలో ఉండే కొన్ని పోషకాలు సహాయపడతాయి.
    భిన్నంగా పోష‌కాలు..
    తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్ రెండూ ఒకే ధాన్యం నుంచి లభించినప్పటికీ, ప్రాసెసింగ్ విధానంలో తేడా ఉంటుంది. తెల్ల బియ్యం తయారీ సమయంలో గింజపై ఉండే బ్రాన్, జెర్మ్ ను తొలగిస్తారు. దీంతో దాని నిల్వ కాలం పెరగడంతో పాటు రుచి మెరుగుపడుతుంది. అయితే ఈ ప్రక్రియలో అనేక విటమిన్లు, ఖనిజాలు కూడా తగ్గిపోతాయి. ఫలితంగా తెల్ల బియ్యంలో ప్రధానంగా పిండి పదార్థాలు (స్టార్చ్), గ్లూకోజ్ రూపంలోని కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. బ్రౌన్ రైస్‌లో మాత్రం పై పొట్టును మాత్రమే తొలగిస్తారు. అందువల్ల ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫాస్ఫరస్, మెగ్నిషియం వంటి పోషకాలు తెల్ల బియ్యంతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల బలానికి తోడ్పడటంతో పాటు శరీరానికి అదనపు పోషకాలను అందిస్తాయి. అయితే బ్రౌన్ రైస్ ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. 100 గ్రాముల ఉడికించిన తెల్ల బియ్యంలో సుమారు 130 కేలరీలు, 29 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 2 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. ఇందులో ఫైబర్, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. అదే 100 గ్రాముల బ్రౌన్ రైస్‌లో సుమారు 112 కేలరీలు, 24 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 2 గ్రాముల ఫైబర్, 2 గ్రాముల ప్రోటీన్, 1 గ్రాము కొవ్వు ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బ్రౌన్ రైస్ ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.