Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మహబుబాబాద్ జిల్లాలో పెరుగుతున్న మహిళలు, బాలికల అదృశ్య కేసులు

    Author VENKATESH | 01 Oct 2026, 12:26 PM | TELANGANA
    మహబుబాబాద్ జిల్లాలో పెరుగుతున్న మహిళలు, బాలికల అదృశ్య కేసులు

    మహబుబాబాద్ జిల్లాలో రోజురోజుకూ మహిళలు, బాలికల మిస్సింగ్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. చదువుకోవాల్సిన వయస్సులో ప్రేమ, ఆకర్షణ పేరుతో పోకిరీల మాయమాటల వలలో చిక్కుకుని బాలికలు ఇళ్లు వదిలివెళ్తున్నారు. కన్నవారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ, అదృశ్యమవుతున్న ఘటనలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనను కల్గిస్తున్నాయి.
    మాయమాటలతో వల..
    ప్రస్తుత సాంకేతిక యుగంలో సోషల్‌మీడియా (ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌) వినియోగం పెరగడంతో కొందరు అల్లరిమూకలు, పోకిరీలు అమాయకపు బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తియ్యటి మాటలు చెప్తూ, విలాసవంతమైన జీవితాన్ని చూపిస్తూ, ప్రేమపేరుతో ఉచ్చు బిగిస్తున్నారు. ఈ ఆకర్షణకు లోనవుతున్న మైనర్లు, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా కన్నపేగును, కష్టపడి పెంచిన తల్లిదండ్రులను వదిలేసి ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నారు. తీరా బయటకు వెళ్లాక ఆ పోకిరీల నిజస్వరూపం బయటపడి మోసపోతున్నామని గ్రహించే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
    246 మిస్సింగ్‌ కేసులు..
    మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 246 మిస్సింగ్‌ కేసులు ఆయా పోలీసుస్టేషన్లలో నమోదు అయ్యాయి. బయ్యారం- 12, చిన్నగూడూరు-2, దంతాలపల్లి-6, డోర్నకల్‌-20, గంగారం-2, గార్ల-9, గూడూరు-19, ఇనుగుర్తి-3, కేసముద్రం-25, కొత్తగూడ-9, కురవి-9, మహబూబాబాద్‌ రూరల్‌-18, మహబూబాబాద్‌ టౌన్‌-43, మరిపెడ-10, నర్సింహులపేట-7, నెల్లికుదురు -11, పెద్దవంగర-5, సీరోలు-4, తొర్రూరు 32 కేసులు నమోదయ్యాయి.
    పట్టణ ప్రాంతాల్లోనే అత్యధికం..
    జిల్లా వ్యాప్తంగా మొత్తం 246 అదృశ్యం కేసులు నమోదు కాగా, అత్యధికంగా మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనే 43 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో తొర్రూరు పరిధిలో-32, కేసముద్రం పరిధి-25, డోర్నకల్‌ పరిధి- 20, గూడూరు పరిధి-19, మహబూబాబాద్‌ రూరల్‌ పరిధి-18 కేసులు నమోదయ్యాయి. ఈకేసుల నమోదును చూస్తే పట్టణాల్లోనే అధికంగా కేసలు నమోదు అవుతున్నాయి.
    తల్లిదండ్రులు గమనించాలి..
    ఆధునిక టెక్నాలోజి అందుబాటులోకి వచ్చిన నేపధ్యంలో బాలికల్లో వస్తున్న మార్పులను తల్లిదండ్రులు గమనించాలి. ఆండ్రాయిఫోన్లు అందుబాటులోకి వచ్చిన క్రమంలో వారు ఏం చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారో పర్యవేక్షించాలి. అదే సమయంలో పోకిరీలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, షీటీమ్స్‌ ద్వారా నిఘా పెంచాలని, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    బాలికల రక్షణ కోసం చర్యలు..
    ఎస్పీ శబరీష్‌
    జిల్లాలో మహిళలు, బాలికలు, మైనర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినులకు చైల్డ్‌సేఫ్టీ, పోక్సో చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. మహిళలు, మై నర్ల నుంచి వచ్చే ఫిర్యాదులపై పోలీస్‌ యంత్రాంగం తక్షణమే స్పం దించి, సత్వర న్యాయం చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించి మహిళలను వేధించే వారిపట్ల కఠిన చర్యలు తీసుకుం టున్నాం. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మహిళా రక్షణ కోసం పోలీస్‌శాఖ నిరంతరం అందుబాటులో ఉంటుంది. అత్యవసర సమయాల్లో బాధితులు డయల్‌ 100 లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలి.
    మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి
    పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు సామ రజిత
    రోజురోజుకూ మహిళలపై జరుగుతున్నదాడులు, దౌర్జన్యాలను అరికట్టాలి. పాలకులు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్న మహిళలు సమస్యలు మాత్రం మారడం లేదు. ప్రతిరోజు మహిళలపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని మహిళలపై జరుగుతున్న దాడులను దౌర్జన్యాలను అరికట్టాలి. చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి.