Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉదయం బ్రేక్‌ఫాస్ట్, పాలు - 6 నుంచి 10 తరగతులకు కొత్తగా అభ్యాస పుస్తకాలు :

    Author VENKATESH | 12 Jun 2026, 12:20 PM | TELANGANA
    ఉదయం బ్రేక్‌ఫాస్ట్, పాలు - 6 నుంచి 10 తరగతులకు కొత్తగా అభ్యాస పుస్తకాలు :

    నూతన విద్యా సంవత్సరం (2026-27)లో ప్రభుత్వ పాఠశాలల బాగుకు వాటిల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న దృఢ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. పేద పిల్లల సంక్షేమానికి ఈసారి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనుంది. విద్యార్థుల సంఖ్యను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ విద్యాశాఖ, మే నెలలోనే బడిబాట కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ప్రతి పాఠశాలలో గతేడాది కంటే ఈసారి 10 శాతం విద్యార్థుల నమోదును పెంచాలని సంబంధిత టీచర్లకు లక్ష్యాన్ని నిర్దేశించింది. జూన్‌ 15న పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరానికి ప్రభుత్వ సమాయత్తం, విద్యార్థుల కోసం తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తే ఇలా ఉన్నాయి.

    అటు వసతులు, ఇటు సంక్షేమం : ఈ ఏడాది నుంచి కొత్తగా 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు ప్రాక్టీస్‌ చేసేందుకు వర్క్‌బుక్స్‌ అందించనున్నారు. ఆగస్టు నెల నాటికి మొత్తం 9 వేల పాఠశాలలకు స్పీడ్ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తారు. విద్యార్థులకు రోజూ అల్పహారంతో పాటు వారంలో మూడు రోజులపాటు నాణ్యమైన పాలు అందిస్తారు. పాఠశాలల పునఃప్రారంభం నాడే యూనిఫామ్‌లు, బూట్లు, బెల్ట్‌ ఇవ్వాలని భావించినా అది కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్యూర్‌(హైదరాబాద్ కోర్ అర్బన్ రిజీయన్) పరిధిలోని పాఠశాలలకు సీఎస్‌ఆర్‌(కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్​బిలిటీ) నిధులతో కార్పొరేట్‌ స్థాయి వసతులు కల్పించనున్నారు. ఇప్పటికే పాఠ్య, నోట్‌ పుస్తకాలు ఆయా స్కూళ్లకు చేర్చామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌ నికోలస్‌ తెలిపారు.

    కొలమానం పిల్లల సంఖ్యే : ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యాసంవత్సరం 20 వేల మంది విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈసారి కనీసం 10 శాతం పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25లో 16.78 లక్షల మంది ఉండగా 2025-26లో ఆ సంఖ్య 16.58 లక్షలకు పడిపోయింది. 10 శాతమంటే దాదాపు 1.65 లక్షల మంది కొత్తగా చేరితేనే సర్కారు లక్ష్యం నెరవేరుతుంది. ఈసారి 2,769 పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నందున వాటిల్లో దాదాపు 30 నుంచి 40 వేల మంది చేరే అవకాశం ఉందని టీచర్లు అంచనా వేస్తున్నారు.

    ఇవి కూడా చదవండి

    ఇలా చేయాలి : ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లో టీచర్లకు బోధనేతర పనులు అధికమవుతున్నాయి. బోధనకు సగం, అంతకంటే తక్కువే సమయం కేటాయిస్తున్నామని 25 శాతం మంది టీచర్లు అభిప్రాయపడినట్లు సమగ్రశిక్షా, హెచ్‌సీయూ, యునిసెఫ్‌ చేసిన అధ్యయనంలో వెలడైంది. దసరాలోపు టీచర్లకు ఇచ్చే ట్రైనింగ్​లు పూర్తిచేసి తర్వాత బడిలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని విద్యా నిపుణులు చెబుతున్నారు.

    ఇంకా లోపాలు ఉన్నాయి : తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం మౌలిక సదుపాయాల ఆధునికీకరణ వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, విద్యార్థుల చేరికలు తగ్గడం, ఉపాధ్యాయుల కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం ఒకవైపు విప్లవాత్మక మార్పుల కోసం ప్రయత్నిస్తుండగా, క్షేత్రస్థాయిలో ఇంకా కొన్ని లోపాలు ఇంకా కొనసాగుతున్నాయి.

    రాష్ట్రంలో దాదాపు 27 వేల ప్రభుత్వ స్కూళ్లు ఉంటే కేవలం 16 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. అదే ప్రైవేటులో కేవలం 12వేల పాఠశాలలు ఉంటే 35 లక్షలకు పైగా విద్యార్థులు చదవడం గమనించాల్సిన విషయం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం నెలకు సగటున రూ. 9వేలు, ఏడాదికి సుమారు రూ. లక్షకు పైగా ఖర్చు చేస్తోంది. సంక్షేమ గురుకుల పాఠశాల హస్టల్​లో ఉండే విద్యార్థులకు కేవలం వసతి కిందనే ఒక్కోక్కరిపై నెలకు సగటున రూ.4,223ల ఖర్చు చేస్తోంది. అయినా కూడా విద్యార్థులకు అక్కక్కడా ఫుడ్ పాయిజనింగ్ వంటి ఘటనలు చోటుచేసుకున్న ఉదంతాలున్నాయి.