Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఒమన్ డ్రోన్ దాడిలో విశాఖ వాసి సురేశ్ మృతి - కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం

    Author VENKATESH | 12 Jun 2026, 12:27 PM | ఆంధ్రప్రదేశ్
    ఒమన్ డ్రోన్ దాడిలో విశాఖ వాసి సురేశ్ మృతి - కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం

    : అతనో బాధ్యతగల భర్త. ఇద్దరు పిల్లలకి ఆదర్శవంతమైన తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆసరా. నిరంతరం సముద్ర కెరటాలతో పోరాడుతూ, వాణిజ్య నౌకను నడిపించే చీఫ్ ఇంజినీర్. మరో కొద్ది రోజుల్లో డ్యూటీ ముగించుకుని ఇంటికొస్తానని చెప్పాడు. తన పిల్లల్ని గుండెలకు హత్తుకుంటానని మురిసిపోయాడు. కానీ విధి ఆ కుటుంబాన్ని ఘోరంగా వంచించింది. ఒమన్‌ తీరంలో నౌకపై జరిగిన డ్రోన్ దాడి, ఆ పచ్చని కుటుంబంలో పెను విషాదం నింపింది. నిన్నటి వరకు తన భర్త బతికే ఉన్నాడన్న ఆశతో ఎదురుచూసిన భార్యకు, విదేశీ ఎంబసీ నుండి వచ్చిన ఒక్క ప్రకటన శరాఘాతమైంది.

    కుటుంబానికి పెద్దదిక్కు : విశాఖపట్నం శ్రీహరిపురంలోని శ్రీనివాస్ నగర్‌కు చెందిన పట్నాల సురేశ్ మెరైన్ ఇంజినీర్. వాణిజ్య నౌకలకు చీఫ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తుంటాడు. ఆయన భార్య పేరు భార్గవి. వీరికి ఆరు, తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. తన వృద్ధ తల్లిదండ్రులతో కలిసే ఉంటున్నారు. సురేశ్ ఆరు నెలలు డ్యూటీలో ఉంటే మిగిలిన ఆరు నెలలు కుటుంబంతో, స్థానిక స్నేహితులతో ఎంతో సరదాగా గడిపేవాడు. ఎవరితోనూ చిన్న మాట కూడా అనిపించుకోని గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ఈ రోజుల్లో ఒకరిద్దరు పిల్లలను పెంచడమే కష్టంగా మారిన తరుణంలో తన సోదరి ఇద్దరు కుమార్తెలను కూడా చేరదీసి, మొత్తం నలుగురు పిల్లల బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. స్థానికంగా ఏ చిన్న కార్యక్రమం జరిగినా ముందుండి ప్రోత్సహించేవాడని స్నేహితులు చెబుతున్నారు.


    ఒమన్ డ్రోన్ దాడిలో విశాఖ వాసి సురేశ్ మృతి - కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం (ETV)
    సురేశ్ జనవరి నెలలో కేవలం పది రోజుల పని కోసమే చైనా వెళ్లాడు. తక్కువ రోజులే కదా అని పెద్దగా వస్తువులు కూడా తీసుకెళ్లలేదు. కానీ, అక్కడ పరిస్థితులు మారిపోవడంతో ఐదు నెలల కాంట్రాక్టుకు ఒప్పుకోవాల్సి వచ్చింది. చైనా, సింగపుర్ మధ్య సాగాల్సిన ఆ నౌక ప్రయాణం, అకస్మాత్తుగా దుబాయ్ వైపు మళ్లింది. అప్పటి నుంచి అక్కడే పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితమే ఆ పరిసరాల్లో నౌకలపై దాడులు జరుగుతున్నాయని సురేశ్ భార్య భార్గవికి తెలిసింది. దీంతో ఆమె ఆందోళన చెందింది. వెంటనే డ్యూటీ వదిలేసి వచ్చేయమని బతిమిలాడింది.

    చివరి మాట అదే : భార్య ఆందోళనను అర్థం చేసుకున్న సురేశ్, పది రోజుల కిందటే తన ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నౌకలోని కార్గోను అప్పగించేసిన వెంటనే ఇంటికి వచ్చేస్తానని భార్యకు మాటిచ్చాడు. కానీ, అదే మాట ఆ కుటుంబానికి చివరి మాట అవుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రమాదానికి కొన్ని గంటల ముందే, అంటే 9వ తేదీ రాత్రి 8.30 గంటలకు ఇంట్లో అందరితో ఫోన్‌లో సరదాగా మాట్లాడాడు. అందరి యోగక్షేమాలు తెలుసుకున్న ఆ గొంతు, ఇప్పుడు శాశ్వతంగా మూగబోయింది.

    ఇవి కూడా చదవండి

    "మా ఆయన గల్లంతైన సమాచారం అందినప్పటికీ, ఆయన బతికే ఉంటారని భరోసాతో ఉన్నాను. దాడి జరిగినప్పుడు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకొని ఉంటారని అనుకున్నా. ఆయనకు ఆ అనుభవం ఉంది. ఏమీ కాదని కుటుంబ సభ్యులకు నేనే ధైర్యం చెప్పా. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆయన మృతదేహం దొరికిందన్న మరణ వార్త వినాల్సి వచ్చింది. ఆయన భౌతికకాయాన్ని వెంటనే ఇక్కడికి తీసుకురావాలి. పిల్లలకు మంచి చదువు అందించడానికి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను."-భార్గవి, సురేశ్ భార్య

    సముద్రమంత శోకం : 10వ తేదీన సురేశ్ కుటుంబానికి పిడుగు లాంటి వార్త అందింది. ఒమన్ తీరంలో సురేశ్ పనిచేస్తున్న నౌకపై డ్రోన్ దాడి జరిగిందని, ముగ్గురు గల్లంతయ్యారని చెప్పారు. అందులో సురేశ్ పేరు కూడా ఉంది. ఆ సమయంలో సముద్రంలో దూకేసి అయినా ఆయన ప్రాణాలు కాపాడుకుని ఉంటారని భార్య ఆశపడింది. ఎందుకంటే ఆయనకు సముద్రంలో ఈదగల అనుభవం ఉంది. కానీ గురువారం మధ్యాహ్నం ఆ నమ్మకం వమ్మయింది. సురేశ్ మృతదేహం దొరికిందని అధికారులు కుటుంబానికి అధికారికంగా సమాచారం అందించారు. దీంతో ఆ ఇంట్లో ఇప్పుడు శోకం సముద్రమంతైంది.

    "సురేశ్ గారు పది రోజుల డ్యూటీకి అని వెళ్లి, అనుకోకుండా అక్కడే కొనసాగాల్సి వచ్చింది. ఒమన్‌ తీరంలో జరిగిన డ్రోన్ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. సురేశ్ భౌతికకాయాన్ని త్వరగా రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని చర్యలు తీసుకుంటున్నాం."-గణబాబు, ఎమ్మెల్యే

    త్వరగా రప్పించండి : సురేశ్ మరణ వార్త తెలిసిన వెంటనే స్థానిక పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. గుండెల్లో కొండంత బాధ ఉన్నా పిల్లల కోసం ధైర్యం తెచ్చుకుంటూ ఆ తల్లి భార్గవి ఒకటే వేడుకుంటోంది. తన భర్తను చివరి చూపు చూసుకునేలా భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించాలని కన్నీళ్లతో కోరుతోంది. తన ఇద్దరు పిల్లల భవిష్యత్తుకు, చదువుకు ప్రభుత్వం ఆసరాగా నిలవాలని వేడుకుంటోంది. కేంద్ర విదేశాంగ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం నేరుగా ఈ విషయాన్ని పర్యవేక్షిస్తున్నాయని, సురేశ్​ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పిస్తామని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.