Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తుల‌సి ఆకుల్లో ఎలాంటి స‌మ్మేళ‌నాలు ఉంటాయి..

    Author VENKATESH | 31 Jul 2026, 01:54 PM | HEALTH
    తుల‌సి ఆకుల్లో ఎలాంటి స‌మ్మేళ‌నాలు ఉంటాయి..

    తులసి భారతీయ సంస్కృతిలో పవిత్రమైన మొక్కగా మాత్రమే కాకుండా, ఆయుర్వేదంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఔషధ మూలికగా కూడా గుర్తింపు పొందింది. భారత ఉపఖండంలో సులభంగా పెరిగే ఈ మొక్క ప్రధానంగా ఆకుపచ్చ రంగులో ఉండే లక్ష్మీ తులసి, ఊదా రంగులో కనిపించే కృష్ణ తులసి అనే రెండు రకాలుగా లభిస్తుంది. భారత్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా తులసి విస్తృతంగా పెరుగుతుంది. హిందూ సంప్రదాయంలో తులసిని పూజించడం, ఇళ్లలో పెంచడం వెనుక ఆధ్యాత్మిక కారణాలతోపాటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయ‌ని భావిస్తుంటారు. తులసి ఆకులను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం, బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభించడం, చర్మం, జుట్టు సమస్యలు తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
    శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌కు..
    ఆయుర్వేదంలో తులసి ఆకులు, విత్తనాలు, ముఖ్యంగా తులసి నుంచి తీసే ఎసెన్షియల్ ఆయిల్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇవి శ్వాసకోశ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంతో పటు మధుమేహం, రక్తపోటు వంటి సమస్యల ప్రమాదాన్ని నియంత్రించడంలో దోహదపడతాయి. తులసిలో ఉండే లినోలిక్ యాసిడ్ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ ఆకుల్లోని సహజ నూనెలు అల‌ర్జీలు, బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇతర సూక్ష్మజీవులపై పోరాడే లక్షణాలు కలిగి ఉంటాయి. అందుకే తులసి పేస్ట్‌, తులసి పొడిని అనేక హెర్బల్‌, సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తుంటారు. వేప, తిప్ప‌తీగ‌, పసుపు వంటి ఔషధ మూలికలతో కలిపి మొటిమలపై రాస్తే చర్మం శుభ్రపడటంతోపాటు మళ్లీ మొటిమలు వచ్చే అవకాశాన్ని కూడా తగ్గించవచ్చు.
    వైర‌ల్‌, బ్యాక్టీరియా ఇన్ఫెక్ష‌న్ల‌కు..
    భారతీయ ఇంటి వైద్యంలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. జ్వరం, జలుబు వంటి సాధారణ సమస్యల నుంచి కొన్ని వైరల్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల వరకు తులసిని సంప్రదాయంగా ఉపయోగిస్తుంటారు. తులసి ఆకులను నీటిలో మరిగించి అందులో సుమారు రెండు గ్రాముల మిరియాల పొడి కలిపి తాగితే రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు శరీరానికి యాంటీ బ్యాక్టీరియల్‌ రక్షణ లభిస్తుంది. అల్లం, తులసి ఆకులు, మిరియాలను కలిపి తయారు చేసే కషాయం జలుబు, దగ్గు వంటి సమస్యల్లో ఉపశమనం కలిగిస్తుంది. తులసి శరీరంలోని విషపదార్థాలను తొలగించే డిటాక్సిఫైయింగ్‌, శుద్ధి చేసే గుణాలను కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్లే కాకుండా చర్మంపై ఉపయోగించడం వల్ల కూడా ప్రయోజనం కలుగుతుంది. దురద, రింగ్‌వార్మ్‌ వంటి కొన్ని చర్మ సమస్యల ఉపశమనానికి కూడా తులసిని సంప్రదాయంగా ఉపయోగిస్తున్నారు. తులసిని తాజాగా కోసిన ఆకుల రూపంలో నేరుగా నమలవచ్చు. అలాగే టీలో కలిపి తాగవచ్చు, కషాయం తయారు చేసుకోవచ్చు, పొడి లేదా పేస్ట్‌ రూపంలోనూ, హెర్బల్‌ సప్లిమెంట్ల రూపంలోనూ వినియోగించవచ్చు.
    మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు..
    తుల‌సి ఆకుల‌లో యాంటీ బయాటిక్‌, యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ కార్సినోజెనిక్‌ లక్షణాలు ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, ఫ్లూ, ఛాతిలో కఫం వంటి సమస్యల నుంచి ఉపశమనం అందించ‌డంలో తులసి సహాయపడుతుంది. దీర్ఘకాలిక బ్రాంకైటిస్‌, ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధుల్లో కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. తులసి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా దోహదపడుతుంది. ఇందులో ఫైటో న్యూట్రియెంట్లు, ముఖ్యమైన ఎసెన్షియల్ ఆయిల్స్‌, విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. తులసిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని కొన్ని జీవక్రియలు సమతుల్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. తులసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే గుణాలను కలిగి ఉంటుద‌ని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను నియంత్రించడం ద్వారా కిడ్నీ రాళ్ల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది దోహదపడుతుంది.