Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆడ దోమలు మాత్రమే రక్తం ఎందుకు పీలుస్తాయి?

    Author VENKATESH | 20 Aug 2026, 06:57 PM | HEALTH
    ఆడ దోమలు మాత్రమే రక్తం ఎందుకు పీలుస్తాయి?

    వర్షాకాలంలో దోమల బెడద పెరుగుతుంది. దోమ కుట్టిన చోట దురద, మంట, వాపు వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే దోమలు అసలు మనుషులు, జంతువుల రక్తాన్ని ఎందుకు పీలుస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అన్ని దోమలు రక్తం పీల్చవు. అంతేకాదు, రక్తం వాటికి ప్రధాన ఆహారం కూడా కాదు.
    ఆడ దోమలే రక్తం ఎందుకు పీలుస్తాయి?
    సాధారణంగా ఆడ దోమలు మాత్రమే మనుషులు, జంతువుల రక్తాన్ని పీలుస్తాయి. మగ దోమలు రక్తాన్ని పీల్చవు. మగ, ఆడ దోమలు రెండూ పూల మకరందం, మొక్కల రసంలోని చక్కెరలను తీసుకుని శక్తిని పొందుతాయి. అయితే ఆడ దోమలు ప్రధానంగా గుడ్లు పెట్టేందుకు, వాటిని అభివృద్ధి చేయడానికి అదనపు పోషకాలు అవసరం. రక్తంలో ఉండే ప్రొటీన్లు, ఇతర పోషకాలు గుడ్ల అభివృద్ధికి ఉపయోగపడతాయి. అందుకే ఆడ దోమలు మాత్రమే మనుషులు, జంతువులను కుడతాయి. రక్తం ద్వారా అవసరమైన పోషకాలను పొందిన తర్వాత గుడ్లను పెట్టేందుకు అనువైన ప్రదేశాన్ని వెతుక్కుంటాయి.
    దోమలు మనుషులను ఎలా గుర్తిస్తాయి?
    దోమలు మనుషులతో పాటు పక్షులు, ఇతర జంతువులను కూడా కుట్టగలవు. ఆహారం కోసం వాటిని గుర్తించడానికి పలు సంకేతాలను ఉపయోగిస్తాయి. మన శరీరం నుంచి వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌, శరీర వేడి, చర్మం నుంచి వచ్చే వాసనలు దోమలకు మన ఉనికిని గుర్తించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మనం శ్వాస తీసుకునేటప్పుడు విడుదల చేసే కార్బన్‌ డయాక్సైడ్‌ దోమలను ఆకర్షించే సంకేతాల్లో ఒకటి.
    దోమ కుట్టిన చోట దురద ఎందుకు వస్తుంది?
    ఆడ దోమ రక్తాన్ని పీల్చే సమయంలో చర్మంలోకి కొంత లాలాజలాన్ని విడుదల చేస్తుంది. ఈ లాలాజలంలోని పదార్థాలు రక్తం గడ్డకట్టకుండా, దోమ సులభంగా రక్తాన్ని పీల్చుకునేలా సహాయపడతాయి. మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఈ లాలాజలానికి ప్రతిస్పందిస్తుంది. దాంతో దోమ కుట్టిన చోట ఎర్రగా మారడం, దురద, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.