Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలి

    Author VENKATESH | 29 Jun 2026, 08:09 PM | నారాయణపేట
    ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలి

    జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS
    - నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి
    - రౌడీ, సస్పెక్ట్, కమ్యూనల్ షీటర్లపై నిరంతర నిఘా
    - వృత్తిపై నిబద్ధత, క్రమశిక్షణ, సమయపాలన పాటించాలి
    - ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
    నారాయణపేట(ఉట్కూర్), జూన్ 29( బీవీకే న్యూస్ )
    పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి ఎలాంటి భేదభావం లేకుండా పారదర్శకంగా, మర్యాదపూర్వకంగా సేవలు అందించాలని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS పోలీసు అధికారులను ఆదేశించారు.
    వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఉట్కూర్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ రామ్‌లాల్, ఎస్ఐ రమేష్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పరేడ్, యూనిఫాం టర్నౌట్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు.
    పోలీస్ స్టేషన్ పరిసరాలు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి, దర్యాప్తు నాణ్యత, ప్రజలకు అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులను ఎలా స్వాగతిస్తున్నారు, ఫిర్యాదులను ఆన్లైన్‌లో ఎలా నమోదు చేస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే CCTNS వ్యవస్థలో కేసుల నమోదు, నిర్వహణ విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు.
    పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, కమ్యూనల్ షీటర్లపై నిరంతర నిఘా ఉంచి విధిగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. నేర నియంత్రణ, క్రైమ్ ప్రివెన్షన్, కేసుల త్వరితగతిన పరిష్కారం, ప్రజలతో సత్సంబంధాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
    ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని వెంటనే స్పందించాలని తెలిపారు. ప్రతి విలేజ్ పోలీస్ ఆఫీసర్ తమకు కేటాయించిన గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి పోలీసు సిబ్బంది నీట్ టర్నౌట్‌తో పాటు వృత్తిపై నిబద్ధత, క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని పేర్కొన్నారు.
    పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో పోలీసులపై నమ్మకం, భద్రత, భరోసా పెంపొందేలా వ్యవహరించాలని సూచించారు. డయల్-100 సేవలపై వేగంగా స్పందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.
    మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించిన ఎస్పీ, ప్రధాన రహదారులపై ప్రమాదాలు అధికంగా జరిగే హాట్‌స్పాట్లను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు.
    దొంగతనాల నివారణకు ముందస్తు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని, "Prevention is Better Than Cure" విధానాన్ని అనుసరిస్తూ నేరాలు జరగక ముందే అప్రమత్త చర్యలు చేపట్టాలని సూచించారు. కాలనీలు, గ్రామాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తూ పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, దొంగతనాలు జరిగిన వెంటనే కేసులను ఛేదించాలని ఆదేశించారు. అక్రమ వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
    అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ మొక్కలు నాటారు.
    ఈ కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ రామ్ లాల్, ఎస్ఐ రమేష్, SB SI భాగ్యలక్ష్మి రెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.