Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సమాచార హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్న అధికారుల నిర్లక్ష్యం

    Author VENKATESH | 30 Jun 2026, 11:01 AM | నల్గొండ
    సమాచార హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్న అధికారుల నిర్లక్ష్యం

    తెలంగాణ కమిషనర్ ఆదేశాలను లెక్కచేయని అధికారులు
    దేవరకొండ 30జూన్ (BVK 3 న్యూస్ ) :
    సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చట్ట స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని సమాచార హక్కు చట్టం రక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి పగిడిమర్రి యాదగిరి ఒక ప్రకటనలో ఆరోపించారు.
    నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని నాలుగు గ్రామాలు సిద్దాపురం, మన్నేవారి పల్లి, ఐనోల్, బొమ్మన్ పల్లి సంబంధించిన సమాచారాన్ని కోరుతూ 15 నెలల(465రోజులు) క్రితం ఆర్టీఐ దరఖాస్తులు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు సమాచారం అందించలేదని తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించగా, కమిషన్ స్పందించి జూన్ 29న సంబంధిత రికార్డుల పరిశీలనకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసిందన్నారు.
    ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం రికార్డుల పరిశీలన కోసం మండల కార్యాలయానికి వెళ్లగా సంబంధిత అధికారులు అందుబాటులో లేక కార్యాలయాలు ఖాళీగా కనిపించాయని పేర్కొన్నారు. అనంతరం మండల ఎంపీడీవోను ఫోన్‌లో సంప్రదించగా, భోజన విరామం కారణంగా అధికారులు బయటకు వెళ్లారని చెప్పి, కొద్దిసేపటి తర్వాత కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు.
    రికార్డుల పరిశీలనలో భాగంగా నాలుగు గ్రామాలకు సంబంధించిన దస్త్రాలను చూపించాలని కోరగా, తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ నుంచి ఎలాంటి లేఖ తమకు అందలేదని అధికారులు చెప్పారని ఆరోపించారు. అయితే కమిషన్ లేఖ అందలేదని లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరడంతో కార్యాలయంలో వెతికి చివరకు కమిషన్ పంపిన లేఖతో పాటు సమాచారం కోసం వచ్చిన మరికొన్ని దరఖాస్తులు కూడా బయటపడినట్లు తెలిపారు.
    ఈ విషయంపై ప్రశ్నించగా, సంబంధిత అధికారి బదిలీపై వెళ్లిపోయారని, తమకు ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం లేదని అధికారులు సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
    ఇలాంటి నిర్లక్ష్య, బాధ్యతారాహిత్య వైఖరి కలిగిన అధికారుల వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని సమాచార హక్కు చట్టం రక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని గౌరవించకుండా ప్రజలకు సమాచారం అందించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.